
ఫలించిన రన్ మిషన్ కష్టం..
● పోలీస్ ఉద్యోగాలకు 14 మంది ఎంపిక
చీపురుపల్లి: రక్షణ దళంలో ఒకటైన ఎయిర్‌ఫోర్స్‌లో ఆయనొక ఉద్యోగి. అయితే అందరి ఉద్యోగుల్లాగా తన పని తాను చేసుకుంటూ కుటుంబం బాగోగులు చూసుకుంటూ ఆయన ఉండలేదు. తన లాగానే మరెంతో మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత పోలీస్, రక్షణ దళంలో చేరాలని అందుకు అవసరమైన సహకారాన్ని అందజేయాలని తపించారు. అందులో భాగంగానే పుట్టుకొచ్చింది రన్ మిషన్. ఆ రన్ మిషన్ ఎంతో మంది యువత ఉద్యోగాలు సాధనకు వేదికై ంది. తాజాగా విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో రన్ మిషన్ నేతృత్వంలో శిక్షణ పొందిన 14 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతో వారంతా రన్ మిషన్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి చెందిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కంది హేమంత్ రన్ మిషన్ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతీ, యువకులకు పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా శిక్షణ తీసుకున్న యువతలో తాజాగా విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో 14 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సివిల్ విభాగంలో ఐదుగురు, ఏపీఎస్‌పీ విభాగంలో 9 మంది ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. రన్‌మిషన్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంతో మందికి ఉద్యోగావకాశాలు లభిస్తుండడంతో వ్యవస్థాపకుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.