
ఆగస్టు 3న జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో ఆగస్టు 9,10,11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరగనున్న జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆగస్టు 3న నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం తెలిపారు. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో నిర్వహించే ఎంపికల్లో అండర్–14,16,18,20 సంవత్సరాల వయస్సు గల బాల, బాలికలు పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని సూచించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
గిరిజనులకు రగ్గుల పంపిణీ
మక్కువ/పార్వతీపురం రూరల్: మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రగ్గులను పంపించారు. ఈ మేరకు బుధవారం ఆ 6 గిరిజన గ్రామాల్లో రగ్గుల పంపిణీ జరిగింది. మండలంలోని బాగుజోలలో 24, చిలక మెండంగి, బెండమెడంగి, తాడిపుట్టి, దోయ్ వర, సిరివర, గిరిజన గ్రామాల్లో 222 కుటుంబాలకు, కుటుంబానికి మూడు రగ్గులు చొప్పున పంపిణీ చేశారు.