
అన్నదాత సుఖీభవలో కోత
విజయనగరం ఫోర్ట్: మెంటాడ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన దేవర పాదాలమ్మకు వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద సాయం అందింది. కూటమి ప్రభుత్వం సాయం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో ఆమె పేరు లేదు. ఆమెకు రెండున్నర ఎకరాల పొలం ఉంది.
● బొండపల్లి మండలం బిల్లల వలసకు చెందిన ఎన్. శ్రీనుకు గ్రామంలో 65 సెంట్ల పొలం ఉంది. వైఎస్సార్‌సీపీ హయంలో ఈ రైతుకు రైతు భరోసా సాయం అందింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో ఈ రైతు పేరు లేదు.
● దత్తిరాజేరు మండలం వి.కృష్ణాపురం గ్రామానికి చెందిన మార్పిన సురేష్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో ఆ రైతు పేరు లేదు. ఈ ముగ్గురు రైతులే కాదు. అనేక మంది రైతులకు ఎదురైన సమస్య ఇది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం అందుకున్న వారికి కూడా కూటమి ప్రభుత్వంలో పథకం అందని పరిస్థితి నెలకొంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎంపిక చేసిన జాబితలో వేలాది మందికి కూటమి ప్రభుత్వం కోత పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందించింది. కానీ కూటమి సర్కార్ మొదటి ఏడాది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న ఆర్థిక సాయం అందించలేదు. రెండో ఏడాది అన్నదాత సుఖీభవ పథకం కూడా ఇంతవరకు అందించిన పాపాన పోలేదు. అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వకపోయినప్పటికీ రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం అని చెప్పి గుర్తించిన లబ్ధిదారుల జాబితాలో భారీగా కోత విధించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మి ఓట్లు వేస్తే ఈ విధంగా కోత పెట్టడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అప్పడు అర్హులమై ఇప్పడు ఏవిధంగా అనర్హులమ య్యామని రైతులు వాపోతున్నారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలనే కుట్రతోనే కూటమి సర్కార్ ఈ విధంగా చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో 2.63 లక్షల మంది రైతులకు లబ్ధి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2.63 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. వారికి జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.13,500 చొప్పన ఆర్ధిక సాయం అందించింది. కూటమి సర్కార్ అన్నదాత సుఖీభవ పథకం కోసం 2.24,356 మంది అర్హులను గుర్తించింది. ఇందులో 2,23,117 మందికి ఈకేవైసీ పూర్తయింది. 1239 మందికి ఈకేవైసీ చేయాల్సి ఉంది. 40 వేలకు పైగా లబ్ధిదారులు గతంలో కంటే తగ్గిపోయారు.
ఇంకా అందని సాగు సాయం
అధికారంలోకి వస్తే రైతుల సాగు పెట్టుబడికి ఆర్థిక సాయం చేస్తామని కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. గద్దె నెక్కిన మొదటి ఏడాదే రైతులకు ఇచ్చిన హామీని ఎగ్గొట్టింది. రెండో ఏడాది ఇంతవరకు సాయం అందించలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అయితే రైతులకు పంట పెట్టుబడికి డబ్బులు లేక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అప్పలు చేసి పంటల సాగుకు పెట్టుబడి పెడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో కంటే తగ్గిన లబ్ధిదారులు
కూటమి పాలనలో అర్హులుగా గుర్తించింది 2.24 లక్షల మంది
తగ్గిన 40 వేల మందికి పైగా లబ్ధిదారులు