
దేశం కోసం మధ్యవర్తిత్వం
విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం అనే ప్రక్రియ చాలా సులువైనది, ఖర్చు లేనిదని ప్రజల్లోకి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధ్యక్షురాలు ఎం. బబిత అన్నారు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆదేశాలతో బుధవారం జిల్లా కోర్టు చాంబర్‌లో మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం కోసం కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న న్యాయమూర్తులంతో భౌతిక సమావేశం, ఇతర ప్రాంతాల్లో ఉన్న న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా మనోవర్తి కేసులు ప్రమాద బీమా కేసులు గృహ హింస కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాణిజ్యపరమైన తగాదా కేసులను సులువుగా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
విద్యార్థికి పాముకాటుపై విచారణ
సాలూరు రూరల్: మండలంలోని తోణాం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మంగళవారం పాముకాటుకు గురైన విషయమై ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం తోణాం ఆశ్రమ పాఠశాల వార్డెన్ లచ్చయ్యను విచారణ చేశారు. విద్యార్థి బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయంలో పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానానికి నీళ్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వస్తోందని ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్డెన్ తెలిపారు. డీఏ జుగా నిధులతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపడతామని విచారణ అనంతరం పీఓ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
నెల్లిమర్ల రూరల్: స్థానిక నగర పంచాయతీ పరిధిలోని చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను వీఆర్‌ఓ వెంకట్రావు బుధవారం పట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై తహసీల్దార్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పంప్ హౌస్ సమీపంలో తవ్వకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడు తూ తవ్వకాలు జరుపుతున్న వ్యక్తికి జరిమానా విధిస్తామన్నారు. సొంత అవసరాలకు మా త్రమే ఎడ్ల బండ్లపై ఇసుకను తరలించే వీలుందని, భారీ వాహనాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఐటీడీఏ పీఓ దృష్టికి
తాగునీటి సమస్య
పాచిపెంట: మండలంలోని కొత్తవలస గ్రామంలో తాగునీటి సమస్యను గ్రామస్తులు సబ్‌కలెక్టర్, ఇన్‌చార్జ్ ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ్ దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం కొత్తవలస గ్రామానికి వచ్చిన ఐటీడీఏ పీఓ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ క్రమంలో గతకొన్ని నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని , ఎన్నిసార్లు అదికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలపగా పక్కనే ఉన్న ఎంపీడీఓతో ఆయన మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. గ్రామ సమీపంలో గల చెరువులో లార్వా దోమలపై డ్రోన్ ప్రయోగాన్ని, స్థానిక పత్తి పంటలో డ్రోన్ ద్వారా ఎరువుల పిచికారీని పరిశీలించారు.కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరారైన చిట్టీల నిర్వాహకురాలు
పార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలస మణికంఠ కాలనీకి చెందిన చిట్టీల నిర్వాహకురాలు వారణాసి జయలక్ష్మి పరారైనట్లు ఆమె వద్ద చిట్టీ కట్టిన బాధితుల ద్వారా బయటపడింది. సుమారు రూ.రెండు కోట్ల వరకు ఆమె టోపీ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తుండగా 45మందికి రూ.90లక్షల మేర బాకీలు ఉన్నట్లు ఐపీ నోటీసులు పంపించడంతో ఒక్కసారిగా ఆమె పరారైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన ఆస్తి రూ.రెండు లక్షల వరకు ఉంటుందని, అది తప్ప తన వద్ద ఇంకేమీ లేవని ఐసీ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. చిట్టీల నిర్వహణలో ఆమెకు సహకరించిన బంధువులు కూడా ఇటీవల పరారీలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా ఆమె చిట్టీల నిర్వహిస్తోంది. అయితే అకస్మాత్తుగా పరారీ కావడంతో కాలనీవాసుల్లో ఆందోళన మొదలైంది. చిట్టీల బాధితులు ఎంతమంది? ఎంతమేరకు నష్టపోయారనేది తేలాల్సి ఉంది.

దేశం కోసం మధ్యవర్తిత్వం