
చెరువులో పడి వ్యక్తి మృతి
గంట్యాడ: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గంట్యాడ మండలంలోని రామవరం గ్రామానికి చెందిన కొల్లి సూరిదేముడు (41) బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో కాలకృత్యాల కోసం అయ్యన్నబంద చెరువుకు వెళ్లాడు. కాలు జారి చెరువులో పడిపోగా లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయాడు. అక్కడే ఉన్న రీసు అప్పన్న గ్రామంలోకి పరుగున వెళ్లి జనాలను తీసుకొచ్చి సూరిదేముడిని బయటకు తీయగా అప్పటికే మరణించాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కృష్ణ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చెరువులో పడి మరో వ్యక్తి..
పార్వతీపురం రూరల్: మండలంలోని ఎమ్మార్‌నగరం గ్రామ శివారులో గల చిన్న రాయుడు చెరువులో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం మృతదేహం పైకి తేలి కనిపించడంతో స్థానికులు పార్వతీపురం రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామంలోని బజారు వీధికి చెందిన సింగిరెడ్డి రమేష్ (35) పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ వ్యక్తి పశువులను శుభ్రం చేసేందుకు చెరువులో దిగి ఈత రాక ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమార్తె ఉంది. జరిగిన సంఘటనపై ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తి..
పూసపాటిరేగ: మండలంలోని కందివలస సంత సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందాడు. కందివలస సంత ఏరియాలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న వ్యక్తి మూర్ఛ వ్యాధితో ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పూసపాటిరేగ పోలీసులు కోరారు. ఈమేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి