
హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్‌పై రైతుల అభ్యంతరం
లక్కవరపుకోట: ఇప్పటికే విలువైన పంట భూములను ఐఓసీఎల్ పైప్‌లైన్, హైపవర్ విద్యుత్ లైన్, గ్రీన్ ఫీల్డ్ హైవే తదితర ప్రాజెక్టుల కోసం లాక్కున్నారని పరిహారం మాత్రం తూతూ మంత్రంగా అందించారని మరో ప్రాజెక్టుకు భూములను ఇచ్ఛేందుకు సిద్ధంగా లేమని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు లక్కవరపుకోట మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ కు చెందిన పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించి శ్రీరాంపురం, కొట్యాడ, కూర్మవరం గ్రామాల రైతులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుధాసాగర్ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విలువైన పంట భూముల్లో అడ్డుగా పైప్‌లైన్ వేస్తే భవిష్యత్ అవసరాలకు భూములను అమ్ముకోదలిస్తే కొనేందుకు ఎవరూ ముందుకు రారని వాపోయారు. పైప్‌లైన్ నిర్మాణానికి సేకరించిన భూమికి మార్కెట్ విలువలో కేవలం 10 శాతం మాత్రమే పరిహారం చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పైప్‌లైన్ నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌పీసీల్ డిప్యూటీ మేనేజర్ ఎం.లక్ష్మణ్, తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, విశ్రాంత తహసీల్దార్ జి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.