
అధికార బలంతో.. అనధికార నియామకం!
విజయనగరం ఫోర్ట్: అధికార బలం ముందు నిబంధనలు చెత్తబుట్టలో కలిసిపోయాయి. అనధికార నియామకానికి అధికార యంత్రాంగం పచ్చజెండా ఊపేసింది. ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గింది. నోటిఫికేషన్ లేకుండానే ఫీల్డు అసిస్టెంట్ పోస్టును భర్తీ చేసేసింది. ఈ అంశం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు కాదని..
గంట్యాడ మండలంలోని నరవ గ్రామం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నది గ్రామస్తుల ఆరోపణ. నోటిఫికేషన్ ఇవ్వకుండానే అధికార పార్టీ నేతలు చెప్పారని ఏకపక్షంగా ఓ మేట్‌ను ఫీల్డు అసిస్టెంట్‌గా నియమించారంటూ గ్రామానికి చెందిన నరవ సన్యాసిరావు అనే వ్యక్తి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఇన్‌చార్జి కలెక్టర్ సేతుమాధవన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తప్పుడు మస్తర్లు వేశారన్న ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ విచారణ చేసి తొలగించిన మహిళా మేట్‌ను ఇప్పుడు ఫీల్డు అసిస్టెంట్‌గా ఎలా నియమిస్తారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దరఖాస్తులు స్వీకరించకుండానే..
ఏదైనా గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఫోస్టు ఖాళీ అయితే సంబంధిత మండల ఎంపీడీఓ నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలి. ఆ దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించి వారి జాబితాను డ్వామా పీడీకి పంపించాలి. పీడీ పరిశీలించి అర్హులను ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియమిస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు 10వ తరతగతి పాస్, లేదా ఫెయిల్ అయిన వారు అర్హులు. 25 రోజులు పాటు పనికి వెళ్లి ఉండాలి, మేట్‌గా పనిచేసి ఉండాలి. మేట్‌గా పనిచేసిన వారు లేక పోతే 25 రోజులు పనిచేసిన వారిని పరిగణలోకి తీసుకోవాలి. అయితే నరవ ఫీల్డు అసిస్టెంట్ పోస్టు భర్తీలో అధికారులు ఇవేవీ పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు చెందిన బంధువు ఒకరు అధికారులపై ఒత్తిడితెచ్చి తమ మనిషిని మేట్‌గా వేయించుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నోటిఫికేషన్ లేకుండానే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు భర్తీ
మంత్రి కొండపల్లి ఇలాకాలో అధికారుల నిర్వాకం
నియామకంపై ఎంపీడీఓ, డ్వామా పీడీది తలోమాట
నరవ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై ఫిర్యాదు

అధికార బలంతో.. అనధికార నియామకం!