
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా అమ్మవారికి నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు,కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఈవీఎం గొడౌన్ల తనిఖీ
నెల్లిమర్ల: నెలిల్లమర్లలో ఉన్న ఈవీఎం గోదాములను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మంగళవారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్లకు, లోపలి గదులకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించారు. బందోబస్తుపై సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా చుట్టుపక్కల, గొదాముల్లోని పరిస్థితులను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్‌డీఓ డి.కీర్తి, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
● ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించిన కలెక్టర్
విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్‌ను రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కలిసి పలు సమస్యలను వివరించారు. బొప్పరాజు మంగళవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుని రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వాటిపై కలెక్టర్ అంబేడ్కర్ సానుకూలంగా స్పందించి జిల్లా స్థాయి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బొప్పరాజుతో పాటు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తాడ్డి గోవింద, సూర్య ఇతర నాయకులు పాల్గొన్నారు.

పుష్పాలంకరణలో పైడితల్లి

పుష్పాలంకరణలో పైడితల్లి