
ఆడపిల్లలకు స్వీయ రక్షణలో ప్రత్యేక శిక్షణ
విజయనగరం క్రైమ్: జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు స్వీయ రక్షణ మెలకువలు నేర్పించేందుకు ప్రత్యేకంగా ఒక మహిళా శిక్షకురాలిని నియమించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు.ఈ మేరకు నగరంలోని కంటోన్మెంట్ శార్వాణి పోలీసు వెల్ఫేర్ ఆంగ్ల పాఠశాలలో నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినులపై జరిగే దాడులు, ఈవ్‌టీజింగ్, ఆకతాయిల వేధింపులు, లైంగిక దాడులను ప్రతిఘటించి, వారి దాడులను తిప్పి కొట్టేందుకు శిక్షణ ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు తమను తాము రక్షించుకునేందుకు కొన్ని స్వీయ రక్షణ టెక్నిక్స్ ను నేర్పాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రాధ అనే మహిళా శిక్షకురాలిని జిల్లా పోలీసుశాఖ నియమించిందని చెప్పారు. ఈ శిక్షకురాలు పాఠశాలల్లోని వ్యాయామ ఉపాధ్యాయులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను ముందుగా నేర్పించి, వారి సహకారంతో అన్ని పాఠశాలల్లోని విద్యార్థినులకు వాటిని నేర్పించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ శిక్షణ కోసం ఉపాధ్యాయులు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఆర్‌ఐ ఎన్.గోపాలనాయుడు, పాఠశాల హెచ్‌ఎం సంధ్య, ఆర్‌ఎస్సైలు ప్రసాదరావు, రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్ధినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.