రిజర్వేషన్లలో పారదర్శకత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లలో పారదర్శకత పాటించాలి

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

రిజర్వేషన్లలో పారదర్శకత పాటించాలి ● నామినేషన్లకు ఆటంకాలు లేకుండా ధ్రువపత్రాలివ్వాలి ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ● కలెక్టర్‌ కార్యాలయంలో వినతి

వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా

సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన కుల, పన్ను ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్‌, ఎన్‌ఓసీ తదితర ధ్రువపత్రాలను సకాలంలో జారీ చేయాలని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఏవో రాణికి వినతిపత్రం అందజేశారు. నామినేషన్ల దాఖలుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ.. జీవీఎంసీ వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా రూపకల్పన, రిజర్వేషన్ల ఖరారులో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. వార్డుల సంఖ్య పెంపునకు తాము వ్యతిరేకం కాదని, అయితే పునర్విభజన నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా, వార్డుల సరిహద్దులను ఏ ప్రాతిపదికన మార్చారో వివరించకపోవడం సమంజసం కాదన్నారు. కొన్ని వార్డుల్లో 29 వేల మందికి పైగా ఓటర్లు ఉండగా, మరికొన్ని వార్డుల్లో 6 వేల మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలపై అధికారులు వివరణ ఇవ్వాలని, పునర్విభజన ప్రక్రియపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 22, అక్టోబర్‌ 7 తేదీల్లో విడుదలైన ఓటర్ల జాబితాల మధ్య కొన్ని వార్డుల్లో సంఖ్యాపరమైన తేడాలు ఉన్నాయని, వాటిపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లను చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, 2011 జనాభా లెక్కల ఆధారంగా పారదర్శకంగా ఖరారు చేయాలన్నారు. అభ్యర్థులకు అవసరమైన ధ్రువపత్రాల జారీలో సచివాలయాలు, మీ సేవా కేంద్రాలు, జీవీఎంసీ జోనల్‌ కార్యాలయాల్లో సర్వర్‌ సమస్యల పేరుతో జాప్యం జరుగుతోందని విమర్శించారు. అర్హులైన ప్రతి అభ్యర్థికీ సమాన అవకాశం కల్పించాలని, నామినేషన్లకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా, చట్టానికి అనుగుణంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మాట్లాడుతూ వార్డుల సరిహద్దుల నిర్ణయంలో జనాభా, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలిగించేలా అధికారులు వ్యవహరించాలని, లేకుంటే వైఎస్సార్‌సీపీ తరఫున చట్టపరమైన పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్‌ దేవన్‌ రెడ్డి, సీఈసీ సభ్యుడు కోలా గురువులు, పార్టీ ముఖ్య నాయకులు కటుమూరి సతీష్‌, పేడాడ రమణికుమారి, పీవీ నారాయణ, తాడి జగన్నాథ రెడ్డి, గుడ్ల వెంకటరమణి రెడ్డి, లింగం శ్రీనివాస్‌, పీవీఎస్వీ ప్రసాద్‌ రాజు, గండ్రాజు వెంకట రవిరాజు, జీలకర్ర నాగేంద్ర, కటారి అనిల్‌కుమార్‌రాజు, ముట్టి సునీల్‌ కుమార్‌, అల్లు శంకర్‌ రావు, ఉరుకూటి చందు, మహ్మద్‌ ఇమ్రాన్‌, వావిలపల్లి ప్రసాద్‌, భర్కత్‌ అలీ, బాకీ శ్యామ్‌ కుమార్‌ రెడ్డి, అల్లంపల్లి రాజబాబు, మంత్రి రాజశేఖర్‌, యల్లపు రఘురాం, బోగవిల్లి గోవింద్‌, సనపల రవీంద్ర భరత్‌, వంకాయల మారుతీ ప్రసాద్‌, వడ్డాడి దిలీప్‌ కుమార్‌, దేవరకొండ మార్కేండేయులు, నీలి రవి, మనోజ్‌ కుమార్‌ గొడబా, కర్రి రామిరెడ్డి, రెయ్యి వెంకట రమణ, జానికీరామ్‌, బొడ్డేటి కిరణ్‌, ప్రసాద్‌, సూరిబాబు, కృష్ణప్ప, ఈశ్వరి పల్లివెల్ల, పద్మా శేఖర్‌, సరిపల్లి సంతోష్‌ ,శ్రీనివాస్‌ రెడ్డి , పామేటి బాబ్జీ, సుశీల, మువ్వల సంతోష్‌, ఎస్‌కే బాబ్జీ, పోతిన హరికృష్ణ, లక్ష్మణ్‌, రత్నం, కేశవ రెడ్డి, రామన్‌ రెడ్డి, సంతోష్‌, జక్కపుడి సత్యనారాయణ, సుకుమార్‌, యరశ్రెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement