సీతంపేట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జోనల్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం విశాఖలో జోన్–1 ఉత్తరాంధ్ర జిల్లాల స్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఎల్ స్క్వేర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రీజినల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సమష్టిగా కృషి చేయడమే జోనల్ సమావేశాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన నేపథ్యంలో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాతపూర్వకంగా సేకరించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. శాఖలోని రెండు క్యాడర్ల మధ్య ప్రమోషన్ చానల్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కొత్త సర్వీస్ రూల్స్ రూపొందించాలన్న న్యాయస్థాన ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఫైర్ సర్వీసుల ఆధునికీకరణకు ప్రభుత్వం సహకరిస్తుండటం శుభపరిణామమని తెలిపారు.అనంతరం ఉద్యోగుల సమస్యలపై రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి సత్యనారాయణ, విజయనగరం జిల్లా అగ్నిమాపక అధికారి సాయి రాజేష్, పార్వతీపురం మన్యం జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం, పెదగంట్యాడ, విశాఖపట్నం–1 స్టేషన్ల సహాయ జిల్లా అగ్నిమాపక అధికారులు గోపీకృష్ణ, వరప్రసాద్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కోశాధికారి పి.వి. సత్యనారాయణ, నాయకులు డి.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రీజినల్ ఫైర్ ఆఫీసర్


