ఐదుగురు మత్స్యకారులు సురక్షితం
మహారాణిపేట: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన మరపడవ.. ఇంజిన్ చెడిపోవడంతో సముద్రంలో మునిగిపోయింది. ఐదుగురు మత్స్యకారులు సమీపంలోని మరో పడవ సిబ్బంది సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వివరాలు.. ఈనెల 7వ తేదీన హార్బర్ నుంచి ఐఎన్‌ఏ ఏపీ–వీ5–770 నంబరు మరపడవలో ఐదుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. గురువారం ఇంజిన్ చెడిపోవడంతో.. ఒడ్డుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తుండగా పడవలోకి నీళ్లు చేరాయి. నీటిని బయటకు పంపించేందుకు మత్స్యకారులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో నీటి ప్రవాహం పెరిగిపోయి గురువారం రాత్రి 11.45 గంటల సమయంలో పడవ మునిగిపోయింది. అదే సమయంలో సమీపంలో ఉన్న మరో పడవ సిబ్బంది మత్స్యకారులను గమనించి సాయం చేశారు. దీంతో ఐదుగురు మత్స్యకారులు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు సురక్షితంగా విశాఖ తీరానికి చేరుకున్నారు. పడవ యజమాని ఎం.దానయ్యకు రూ.25 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని ఏపీ మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లక్ష్మయ్య, గౌరవ అధ్యక్షుడు పి.సి.అప్పారావు తెలిపారు. జీవనోపాధి కోల్పోయిన దానయ్యను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మత్స్య శాఖ జేడీ బర్ధన్, ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఈ విషయం తెలియజేసినట్లు చెప్పారు.


