అక్కిరెడ్డిపాలెం: మద్యం సేవించడం, జల్సాలకు డబ్బులు అవసరమై నేరానికి పాల్పడిన ముగ్గురు నిందితులను గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లారీని అడ్డగించి డ్రైవర్‌పై దాడి చేసి లారీ తాళం, నగదు దోచుకున్న ఘటనకు సంబంధించిన వివరాలను గాజువాక క్రైమ్ విభాగం సీఐ జీడీ. బాబు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. పెదగంట్యాడ గంగవరం ప్రాంతానికి చెందిన పళ్లేటి దిలీప్ కుమార్, రాము, చోడిపిల్లి సాగర్ ముందస్తు పథకం ప్రకారం నేరానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ నెల 5న అర్ధరాత్రి ఒడిశాకు చెందిన లారీ పోర్టు వై జంక్షన్ మీదుగా ఒడిశా వైపు వెళ్తుండగా, ముగ్గురు నిందితులు ద్విచక్ర వాహనంపై వచ్చి లారీపై రాళ్లు విసిరి వాహనాన్ని అడ్డగించారు. లారీ డ్రైవర్ రాజేష్ పాండా కిందకు దిగగానే ఓ నిందితుడు అతని కాలర్ పట్టుకుని దాడి చేయగా, మరో నిందితుడు లారీలోకి ప్రవేశించి తాళం, రూ.4,200, వాలెట్‌ను దోచుకున్నాడు. అనంతరం ముగ్గురు కలిసి నగదును పంచుకున్నారని సీఐ తెలిపారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన క్రైమ్ పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి లారీ తాళం, రూ.4,200, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.


