బీసీలకు
సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేయడంతో చంద్రబాబు కపట ప్రేమ మరోసారి తేటతెల్లమైంది. ‘మేం 34 శాతం ఇవ్వాలనే అనుకున్నాం.. కానీ కోర్టులే కొట్టేశాయి’ అని సానుభూతి పొందుతూ చేతులు దులిపేసుకునేందుకే చంద్రబాబు ఈ డ్రామా ఆడారని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. చట్టబద్ధత లేని జీవోలు ఇచ్చి, అవి వీగిపోయాక న్యాయస్థానాలపై నెపాన్ని నెట్టేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని, ఇది అక్షరాలా బీసీలకు తీరని ద్రోహం చేయడమేనని ప్రతిపక్షాలు, సామాజికవర్గ ప్రతినిధులు ధ్వజమెత్తుతున్నారు.
బీసీల ముందు మొసలి కన్నీరు
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఉన్నాయని తెలిసీ చంద్రబాబు ఈ నాటకానికి తెరతీశారు. చట్టపరంగా నిలబడవని తెలిసినా, ఎన్నికల ముందు బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకే హడావుడిగా రెండు జీవోలు (జీవో నెం: 105, 106) జారీ చేశారు. కోర్టు ఆ జీవోలను కొట్టివేయగానే బీసీల ముందు మొసలి కన్నీరు కార్చాలన్నదే కూటమి ప్రభుత్వ పక్కా వ్యూహమని స్పష్టమవుతోంది.
నాడు బీసీలకు అగ్రపీఠం
సరిగ్గా ఇదే పరిస్థితి 2021 స్థానిక ఎన్నికల సమయంలో ఎదురైనప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుకూ, నేడు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలకు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా కనిపిస్తోంది. అప్పట్లో వైఎస్ జగన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తే, టీడీపీ తెరవెనుక శక్తులు కోర్టుకు వెళ్లి దాన్ని నిలిపివేయించాయి. దాంతో రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. అయితే వైఎస్ జగన్ కోర్టు తీర్పును సాకుగా చూపి వదిలేయలేదు. ఆ కోత పడిన 10 శాతం లోటును వైఎస్సార్‌సీపీ సొంత కేటాయింపుల (బీ–ఫారాల) ద్వారా భర్తీ చేసి బీసీలకు అగ్రపీఠం వేశారు.
జీవీఎంసీ ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం
2021 విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 98 వార్డులు ఉంటే, వైఎస్సార్‌సీపీ ఏకంగా 65 వార్డులను బీసీలకే కేటాయించి చరిత్ర సృష్టించింది. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సింది 33 సీట్లే అయినా, వైఎస్ జగన్ తన సొంత కోటాలో అదనంగా మరొక 32 సీట్లను బీసీలకే ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు.
చంద్రబాబు అంటేనే నయవంచన
ఎన్నికల వేళ బీసీ జపం చేయడం, అధికారంలోకి రాగానే సొంత సామాజికవర్గానికి అందలం ఎక్కించి బీసీలను పురుగుల్లా చూడటం చంద్రబాబు నైజం. వైఎస్ జగన్ హయాంలోనే ఆర్భాటాలు లేకుండా సామాన్య బీసీలకు 50 శాతం పదవులు దక్కి నిజమైన గౌరవం లభించింది. సమస్యలపై వెళ్తే ‘తోకలు కత్తిరిస్తాం‘ అని హెచ్చరించిన చంద్రబాబు కపట నాటకాలను బీసీ సమాజం ఎన్నడూ మరవదు. – రొంగలి జగన్నాథం,
వైఎస్సార్‌సీపీ సీడబ్ల్యూసీ మెంబర్
50 శాతం పరిమితి దాటుతుందని
తెలిసీ రిజర్వేషన్ల జీవోలు
న్యాయస్థానాల్లో నిలవని హామీలతో
బీసీలను మభ్యపెట్టే యత్నం
నాడు 65 శాతానికి పైగా పదవులిచ్చి
అండగా నిలిచిన వైఎస్ జగన్
కూటమి నయవంచనపై క్షేత్రస్థాయిలో
రగులుతున్న బీసీలు


