మేయర్‌ ఇంట పెళ్లికి జీవీఎంసీ ‘బ్యాండ్‌’ బాజా | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ ఇంట పెళ్లికి జీవీఎంసీ ‘బ్యాండ్‌’ బాజా

Feb 25 2026 10:38 AM | Updated on Feb 25 2026 10:38 AM

మేయర్‌ ఇంట పెళ్లికి జీవీఎంసీ ‘బ్యాండ్‌’ బాజా

మేయర్‌ ఇంట పెళ్లికి జీవీఎంసీ ‘బ్యాండ్‌’ బాజా

ప్రభుత్వ సిబ్బంది, వనరుల వినియోగంపై విమర్శలు పదుల సంఖ్యలో పారిశుధ్య కార్మికులు పెళ్లి పనుల్లో నిమగ్నం జీవీఎంసీ బయో టాయిలెట్లు, లైటింగ్‌, ఇతర సదుపాయాలు అక్కడికే.. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, స్పీడ్‌ బ్రేకర్ల తొలగింపు

పెందుర్తి: నగరంలో సాధారణ పౌరుడు ఒక ఫ్లెక్సీ పెట్టాలన్నా.. చిన్న గొయ్యి తవ్వాలన్నా.. రహదారిపై లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నా జీవీఎంసీ అనుమతి తప్పనిసరి. బీఆర్‌టీఎస్‌ వంటి ప్రధాన రహదారిపై అయితే నిబంధనలు మరింత కఠినంగా అమలవుతాయి. కానీ నగర తొలి పౌరుడైన మేయర్‌ పీలా శ్రీనివాసరావు కుటుంబ వేడుకకు మాత్రం ఆ నిబంధనలు వర్తించవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మేయర్‌ కుమారుడి వివాహం సందర్భంగా పెందుర్తిలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లలో జీవీఎంసీ సిబ్బంది, వనరులు విస్తృతంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. దాదాపు పది రోజులుగా పదుల సంఖ్యలో పారిశుధ్య కార్మికులు వివాహ వేదిక పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. జీవీఎంసీకి చెందిన బయో టాయిలెట్లు, లైటింగ్‌ సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పెందుర్తి ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణలోనే ఈ పనులు సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్పీడ్‌ బ్రేకర్లు పీకేశారు

ప్రమాదాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన స్పీడ్‌ బ్రేకర్లను కూడా తొలగించిన ఘటన చర్చనీయాంశమైంది. పెందుర్తి పాతూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్పీడ్‌ బ్రేకర్లను వివాహ వేడుకల కారణంగా తొలగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ రహదారిపై కూడా వేగ నియంత్రణ చర్యలను సడలించినట్లు తెలుస్తోంది. ప్రమాద అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు ప్రజల భద్రతను ప్రమాదంలోకి నెట్టే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పెళ్లి కోసం కొన్ని రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం చేసి జీవీఎంసీ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జీవీఎంసీ సిబ్బంది సేవలు

బుధవారం జరగనున్న మేయర్‌ కుమారుడి వివాహ వేదిక ఏర్పాట్లు దాదాపు పక్షం రోజులుగా జరుగుతున్నాయి. అయితే ఈ ఏర్పాట్లు కోసం ప్రైవేటు లేబర్‌తో పాటు జీవీఎంసీలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది, ఇతర విభాగాల్లో సిబ్బందిని యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. దాదాపు పదుల సంఖ్యలో జీవీఎంసీ కార్మికులు గత పది రోజులుగా వివాహ వేదిక సేవలకే అంకితమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా జీవీఎంసీకి చెందిన పదుల సంఖ్యలో బయో టాయిలెట్లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. చాలా వరకు పెళ్లి పనులను స్వయంగా జీవీఎంసీ ఉన్నతాధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి ప్రభుత్వ సిబ్బంది, వనరులను వినియోగించడం అధికార దుర్వినియోగం కాదా అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement