చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

Feb 25 2026 10:38 AM | Updated on Feb 25 2026 10:38 AM

చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

● 1.20 లక్షల మంది వస్తారని అంచనా ● కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌

సింహాచలం : ఏప్రిల్‌ 30న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరేందిరప్రసాద్‌ తెలిపారు. చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై మంగళవారం ఆయన సింహగిరిపై దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది చందనోత్సవానికి 1.20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తికర దర్శనం కల్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. బారికేడింగ్‌తో సహా అన్ని సివిల్‌, నిర్మాణ పనులు మార్చి 31లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూలైన్లలో సాధ్యమైనంత వరకు శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. తాత్కాలిక షెల్టర్‌ ఏదైనా ఏర్పాటుచేస్తే ముందుగా ఆర్‌అండ్‌బీ లేదా వివిధ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ల ద్వారా సర్టిఫై చేయిస్తామన్నారు. సాధారణ భక్తులకు ఉదయం 3గంటల నుంచి రాత్రి 11గంటల వరకు దర్శనం కల్పించే ప్రణాళిక చేశామన్నారు. వీఐపీలు, వీవీఐపీలకు ఉదయం 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే ప్రత్యేక టైమ్‌ స్లాట్‌లు ఉంటాయని తెలిపారు. రూ. 300, రూ. 1000, రూ. 1500 టికెట్ల దర్శనాల క్యూలు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభమవుతాయన్నారు. వారం ముందే టికెట్ల జారీ ప్రక్రియని పూర్తిచేస్తామన్నారు. టిక్కెట్లపై క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. బస్సుల నిర్వహణ, పికల్‌–డ్రాప్‌ పాయింట్లు, పార్కింగ్‌ ప్రాంతాలపై స్పష్టమైన ప్లాన్‌ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణంలోకి సెల్‌ఫోన్లు అనుమతి ఉండదని, పోలీసులు, సేవావలంటీర్లతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్‌ స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement