కంబాలకొండ పరిరక్షణకు ‘బృహత్’ ప్రణాళిక
విశాఖ సిటీ : కంబాలకొండలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక ప్రాజెక్టుకు బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ పేర్కొన్నారు. మంగళవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో కంబాలకొండ ఎకో–సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్) పరిధిలో ‘ముసాయిదా జోనల్ బృహత్ ప్రణాళిక’పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో వివిధ శాఖల అధికారులు, భాగస్వామ్య పక్షాలతో ఈ ప్రణాళికపై చర్చలు జరిపారు. లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు సిద్ధం చేసిన ముసాయిదా ప్రణాళికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ జారీ చేసిన నిబంధనల మేరకు మొత్తం 30.51 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఈ జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాన్‌లో ప్రస్తుత పరిస్థితులు, రహదారుల అనుసంధానత, భవిష్యత్తులో చేపట్టబోయే రహదారి నెట్‌వర్క్ వివరాలను స్పష్టంగా పొందుపరచాలని కన్సల్టెంట్లను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను ఈ ప్రణాళికలో అంతర్భాగం చేయాలని లీ అసోసియేట్స్ ప్రతినిధులను ఆదేశించారు. డీఎఫ్‌వో రవీంద్ర ధామా మాట్లాడుతూ కంబాలకొండ వంటి సున్నితమైన ప్రాంతాల్లో పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎకో–సెన్సిటివ్ జోన్ పరిధిలో పర్యాటక కార్యకలాపాలను పర్యావరణ హితంగా ఉండేలా సమగ్రంగా రూపకల్పన చేయాలని సూచించారు.


