పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోండి
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని, అంతేకానీ ప్రజల విన్నపాల పట్ల అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆయన ఘాటుగా హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో భాగంగా కొన్ని వారాలుగా ప్రజల ఫిర్యాదులకు సరైన పరిష్కారం చూపడంలో విఫలమవుతున్న పది మంది అధికారులను కలెక్టర్ నేరుగా పిలిపించి సంజాయిషీ కోరారు. ఇప్పటికే రెండుసార్లు మెమోలు ఇచ్చినప్పటికీ పనితీరులో మార్పు రాకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడంలో వెనుకబడడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. కేవలం మొక్కుబడిగా సమాధానాలు ఇవ్వడం కాకుండా, సమస్య మూల కారణాలను గుర్తించి నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు హితవు పలికారు.
312 వినతుల స్వీకరణ
జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి కలెక్టర్ హరేందిరప్రసాద్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. భూమి వివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు, సామాజిక భద్రతా పథకాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న వినతులపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని, అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజల నుంచి మొత్తం 312 వినతులు అందగా.. అత్యధికంగా రెవెన్యూ విభాగానికి సంబంధించి 115, జీవీఎంసీకి 84, పోలీస్ శాఖకు 17 , ఇతర శాఖలకు చెందిన 96 దరఖాస్తులు ఉన్నాయి. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో సత్తిబాబు, ఏడీసీ సత్యవేణి సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన
అగ్రిగోల్డ్‌లో తాము దాచుకున్న సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరుతూ ఆషా, సలీమ్ దంపతులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. 2012లో తమ కుమార్తె వివాహం కోసం రెండు విడతలుగా సుమారు రూ.2 లక్షలు జమ చేశామని, 13 ఏళ్లు గడిచినా నేటికీ పైసా కూడా తిరిగి రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టార్జితాన్ని ఇప్పించి ఆదుకోవాలని వారు అధికారులను వేడుకున్నారు.
పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోండి


