ఉగాది నాటికి టిడ్కో ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

ఉగాది నాటికి టిడ్కో ఇళ్లు

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

ఉగాది నాటికి టిడ్కో ఇళ్లు

ఉగాది నాటికి టిడ్కో ఇళ్లు

డాబాగార్డెన్స్‌: నగరంలోని పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ, నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాలను ఉగాది పండగ నాటికి లబ్ధిదారులకు అందించాలని టిడ్కో మేనేజింగ్‌ డైరక్టర్‌ సునీల్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, అదనపు కమిషనర్‌ సత్యవేణిలతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 36 లేఅవుట్లలో ఇప్పటికే 16 చోట్ల 7,344 ఇళ్లను పంపిణీ చేశామని, మిగిలిన ఇళ్లను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక మేళా నిర్వహించి ఇళ్లను అప్పగించేందుకు వీలుగా మౌలిక వసతుల కల్పనలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలన్నారు. లబ్ధిదారులకు రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు, ప్రైవేట్‌ ఫైనాన్స్‌ ఏజెన్సీలు ప్రత్యేక చొరవ చూపి సహకరించాలని కోరారు. అలాగే రద్దయిన గృహాలకు సంబంధించి లబ్ధిదారులు చెల్లించిన నగదును తిరిగి చెల్లించేందుకు నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ మాట్లాడుతూ మార్చి మొదటి వారం నాటికే అన్ని పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని జోనల్‌ కమిషనర్లకు స్పష్టం చేశారు. బ్యాంకర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ రుణ ప్రక్రియను వేగవంతం చేయాలని, టిడ్కో ఇంజనీర్లు, మెప్మా సిబ్బంది సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పనిచేసి లబ్ధిదారులకు సకాలంలో ఇళ్లు అందేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.

టిడ్కో ఎండీ సునీల్‌కుమార్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement