ప్రారంభానికి సిద్ధమవుతున్న అంజాదిప్
సింథియా : ఎనిమిది నౌకలతో కూడిన యాంటీ–సబ్‌మైరెన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రొజెక్ట్‌లోని మూడో నౌక అంజాదిప్ ప్రారంభానికి సిద్ధమవుతోందని నావికాదళ వర్గాలు తెలిపారు. ఈ యుద్ధ నౌకను ఈనెల 27న చైన్నె ఓడరేవులో నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి అధ్యక్షతన, తూర్పు నావల్ కమాండ్‌లో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. దేశ రక్షణలో వేగవంతమైన పురోగతిని సాధించడంలోనూ, ఆత్మనిర్భర్ భారత్‌కు అనుగుణంగా రూపకల్పన చేయబడిన ఈ నౌక దేశ భద్రతలో కీలకమైన సవాళ్లను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ నౌకను కోల్‌కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. ఇది తీరప్రాంతాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించడం, ట్రాక్ చేయడం, నిరోధించడం కోసం నిర్మించిన పూర్తి స్వదేశీ నౌక. ఈ నౌకలో యుద్ధ ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీ, హల్ మౌంటెడ్ సోనార్ అభయ్, తేలికపాటి టార్పెడోలు, యాంటీ–సబ్‌మైరెన్ వార్‌ఫేర్ రాకెట్లు అమర్చబడ్డాయి. 77 మీటర్ల పొడవున్న ఈ నౌక హైస్పీడ్ వాటర్ జెట్ ప్రొపల్షన్ వ్యవస్థను కలిగి ఉంది. ఇది వేగవంతమైన ప్రతిస్పందన, స్థిరమైన కార్యకలాపాల కోసం 25 నాట్ల గరిష్ట వేగాన్ని సాధించడానికి వీలు కల్పిస్తుంది. కార్వర్ తీరంలో చారిత్రాత్మకంగా ఉన్న ముఖ్యమైన ద్వీపం పేరు మీదుగా ఈ అంజాదిప్ నౌకను నావికాదళంలో చేర్చుకోవడం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలతో సహా భారతదేశ విస్తారమైన సముద్ర ప్రయోజనాలను, తీరప్రాంత విధానాలను కాపాడుకునే నావికాదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.


