చైనీస్ మాంజాపై పూర్తి నిషేధం
విశాఖ సిటీ : ప్రాణాంతకంగా మారుతున్న చైనీస్ మాంజాపై నిషేధం ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి సందర్భంగా పిల్లలు కేవలం సంప్రదాయ కాటన్ దారంతో మాత్రమే గాలిపటాలు ఎగురవేసేలా తల్లిదండ్రులు చూడాలని సూచించారు. ఈ సింథటిక్ దారం ద్విచక్ర వాహనదారుల మెడకు తగిలి ప్రాణాంతక గాయాలు అవుతున్నాయని, గాలిపటాలు ఎగురవేసే క్రమంలో పిల్లల వేళ్లు తెగుతున్నాయని, పక్షులు, వన్యప్రాణులు ఈ దారంలో చిక్కుకుని మరణిస్తున్నాయని తెలిపారు. ఈ దారం విద్యుత్ తీగలకు తగిలితే విద్యుత్ షాక్, అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందన్నారు. చైనీస్ మాంజా అమ్మకాలు, నిల్వ, రవాణా, వాడకంపై ప్రత్యేక నిఘా, ఆకస్మిక తనిఖీలు జరుగుతాయన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం దీనిపై పూర్తి నిషేధం ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చైనీస్ మాంజా అక్రమ విక్రయాలు, నిల్వల కోసం సమాచారం తెలిస్తే డయల్ 112కు గాని, సీపీ వ్యక్తిగత నెంబర్ 7995095799కు లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.


