కేజీహెచ్‌లో ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన
మహారాణిపేట: ప్రపంచ బ్యాంక్‌కు చెందిన ఉన్నత స్థాయి సాంకేతిక బృందం మంగళవారం కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కళాశాలను సందర్శించింది. రాష్ట్రంలో ఆరోగ్య సేవల నాణ్యత పెంపులో భాగంగా.. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు డాక్టర్ మొహిర్జోన్ అహ్మదోవ్, డాక్టర్ కేరీ గార్డనర్, గణేష్ మరిముత్తులతో కూడిన బృందం ఆసుపత్రిని సందర్శించింది. వీరికి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ మెడిసిన్, ప్రసూ తి విభాగాల అధ్యాపకులు ఆసుపత్రి పనితీరును వారికి వివరించారు. బృందం సభ్యులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, డయాగ్నోస్టిక్ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం, పరీక్షల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. అనంతరం బృందం లేబర్ కాంప్లెక్స్‌ను సందర్శించి, అక్కడి వసతులను పరిశీలించింది. ప్రసవ సమయంలో అందిస్తున్న సేవలు, లేబర్ రూమ్ నిర్వహణపై విభాగపు వైద్యులతో సుదీర్ఘంగా చర్చించారు. కేజీహెచ్ అత్యవసర వైద్య విభాగాధిపతి వి.ఎస్.ఎన్.మూర్తి, డాక్టర్ ఎన్.నవీన్, డాక్టర్ కిరణ్‌కుమార్, గైనిక్ విభాగాధిపతి జి.సౌమిని, ప్రొఫెసర్ పి.జయంతి, అసోసియేట్ ప్రొఫెసర్ పి.సుధా పద్మశ్రీ, డిప్యూటీ సూపరింటెండెంట్లు డి.రాధాకృష్ణన్, డాక్టర్ వాసవీ లత, డాక్టర్ ఎం.చంద్రశేఖరం నాయుడు పాల్గొన్నారు.


