యోగానంద నారసింహుడిగా అప్పన్న
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు మంగళవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి యోగానంద నారసింహుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని యోగానంద నారసింహుడిగా ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల సమేతంగా స్వామిని ఒక పల్లకీలో, ఆళ్వారులను వేరొక పల్లకీలో అధిష్టింపజేశారు. సాయంత్రం ఆలయ మాడవీధిలో స్వామికి వైభవంగా తిరువీధి నిర్వహించారు. ఈ తిరువీధిలో భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.


