విద్యే వజ్రాయుధం
మధురవాడ/కొమ్మాది: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గురుకులాల్లో గురువారం ఉదయం అందించే ఉప్మా స్థానంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తామని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సి.హెచ్.విజయప్రతాపరెడ్డి వెల్లడించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మధురవాడ, మారికవలస, ఎండాడ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలు, జిల్లా పరిషత్ హైస్కూల్, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. భోజన నాణ్యత, వంటల తీరు, రకుల నిల్వలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. గురువారం ఉదయం పెట్టే ఉప్మా తినలేకపోతున్నామని మారికవలస గురుకుల విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఆయన.. ఉప్మా బదులుగా విద్యార్థులకు ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టే యోచనలో ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్య వజ్రాయుధం లాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా నైపుణ్యాలు పెంచుకుంటే ప్రైవేట్ రంగంలోనూ అపార అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులు అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
చైర్మన్‌కు చిన్నారుల గ్రీటింగ్స్
ఎండాడ పాఠశాల సందర్శనలో విద్యార్థులు చైర్మన్‌కు ఘన స్వాగతం పలికారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఫుడ్ ఈజ్ గాడ్ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులను ఆయనకు అందజేశారు. వాటిని ఆయన సంతోషంగా స్వీకరించారు. ఫుడ్ కమిషన్ సభ్యుడు సూర్యకిరణ్, డీసీఎస్‌వో వి.భాస్కరరావు, సివిల్ సప్లై మేనేజర్ ఎం.శ్రీలత, డీఈవో ఎన్.ప్రేమకుమార్, ఐసీడీఎస్ పీడీ కేవీ రామలక్ష్మి, ఫుడ్ సేఫ్టీ అధికారి కల్యాణ్ చక్రవర్తి, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డిప్యూటీ కంట్రోలర్ కె.టి.రవికుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ రామారావు, మధ్యాహ్న భోజనం పథకం కో–ఆర్డినేటర్ మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మెనూ పాటించాల్సిందే..
పాఠశాలల్లో కచ్చితంగా మెనూ ప్రకారమే ఆహారం అందించాలని, పౌష్టికాహార సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని ఫుడ్ కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. ఎండాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. అలాగే రేషన్ డిపోల ద్వారా లబ్ధిదారులకు బియ్యం, పంచదార సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. సివిల్ సప్లై, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సోషల్ వెల్ఫేర్ వంటి విభాగాలు తమ కమిషన్ పరిధిలోకి వస్తాయని, ఎటువంటి సమస్యలున్నా తమను సంప్రదించవచ్చని తెలిపారు.
విద్యే వజ్రాయుధం


