● ముప్పుటంచున సాగర తీరం
ఏయూక్యాంపస్: విశాఖ సముద్ర తీరం అలల తాకిడికి నానాటికి కుచించుకుపోతోంది. ముఖ్యంగా ఆర్.కె.బీచ్‌లోని విక్టరీ ఎట్ సీ ఎదురుగా ఉన్న ప్రాంతం తీవ్రమైన కోతకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అలల ఉధృతి కారణంగా తీరంలోని ఇసుక సముద్రంలోకి కొట్టుకుపోతుండటంతో, అక్కడి పచ్చదనం క్రమంగా కనుమరుగవుతోంది. గతంలో తీర రక్షణ కోసం, సౌందర్యం కోసం నాటిన కొబ్బరి చెట్లు ఇప్పటికే అలల తాకిడికి నేలకొరిగి సముద్రంలో కలిసిపోయాయి. తాజాగా, వాటి వెనుక రక్షణగా నాటిన మరికొన్ని మొక్కలు కూడా సముద్రంలో కలిసే ప్రమాదం ఏర్పడింది. మొక్కలను, తీరాన్ని రక్షించడానికి గతంలో రాళ్లతో నిర్మించిన గేబియన్ స్ట్రక్చర్ కూడా అలల ధాటికి దెబ్బతింది. ప్రస్తుతం ఆ రాళ్లు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇవి అలల వేగాన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పర్యాటకులు సముద్ర తీరంలో కాలు మోపడం కూడా కష్టసాధ్యంగా మారే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణం స్పందించి, నిపుణుల సూచనలతో తీరం కోతకు అడ్డుకట్ట వేసేలా శాశ్వత పరిష్కార మార్గాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శాశ్వత పరిష్కారం ఎక్కడ?
● ముప్పుటంచున సాగర తీరం


