ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్‌పో ప్రారంభం
పరవాడ: ఫార్మా రంగంలో వస్తున్న వినూత్న మార్పులు, అధునాతన సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని జేఎన్‌పీసీ ఫార్మా మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జెట్టి సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్‌పోను ఉద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం ఫార్మాసిటీ క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశవిదేశాల్లో తయారైన అధునాతన ఫార్మా పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల యాజమాన్యాలు ఈ కొత్త సాంకేతికతను తమ పరిశ్రమల్లో వినియోగించి అభివృద్ధి సాధించాలని సూచించారు. పరవాడతో పాటు అచ్యుతాపురం, నక్కపల్లి, పైడిభీమవరం, పూసపాటిరేగ ప్రాంతాల్లోని పరిశ్రమలకు, అక్కడ పనిచేస్తున్న సుమారు 60 వేల మంది ఉద్యోగులకు, ఫార్మసీ, కెమికల్ విభాగాల విద్యార్థులకు ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో మొదటి రోజు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించారు. రెండో రోజు బాయిలర్ డిపార్ట్‌మెంట్‌పై, మూడో రోజు పర్యావరణం అంశాలపై సంబంధిత అధికారులు అవగాహన కల్పిస్తారని వివరించారు. ఎగ్జిబిషన్‌లో 150 సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎన్.సూర్యప్రకాశరావు, ఎం.ఎ.ఎస్.ఎం అధ్యక్షుడు ఎం.శివరామప్రసాద్, డ్రగ్ కంట్రోల్ ఏడీ ఎస్.విజయకుమార్, జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి ఎన్.కల్యాణి, ఏఎస్‌ఆర్ జిల్లా అధికారి కె. ఇందిరాభారతి తదితరులు పాల్గొన్నారు.


