అల్లరి చేశాడని తల పగలకొట్టారు
ఆరిలోవ: తరగతి గదిలో ఓ విద్యార్థి అల్లరి చేస్తున్నాడన్న నెపంతో ఓ ఉపాధ్యాయురాలు.. చేతిలో ఉన్న ఫ్లాంక్‌తో తలపై కొట్టారు. దీంతో విద్యార్థి తలపై గాయమైంది. ఆరిలోవ ప్రాంతంలోని సీతాంజలి ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లి, స్థానికులు తెలిపిన వివరాలివి. పెదగదిలికి చెందిన జోష్ అనే విద్యార్థి పాత ఆరిలోవలోని సీతాంజలి స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం తరగతిలో పిల్లలు అల్లరి చేస్తున్నారని మందలించే క్రమంలో గణిత ఉపాధ్యాయురాలు జోష్‌ను ఫ్లాంక్‌తో తలపై కొట్టడంతో గాయమైంది. సాయంత్రం స్టడీ అవర్‌లో ఉండకుండా తొందరగా ఇంటికి వెళ్లిన బాలుడి తల నుంచి రక్తం కారడాన్ని గమనించిన తల్లి.. వెంటనే పాఠశాలకు వెళ్లి నిలదీశారు. అయితే.. ‘అది చిన్న దెబ్బే.. అంత గాబరా పడాల్సిన పనిలేదు’ అంటూ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పంపించేసిందని ఆమె తెలిపారు. రక్తం కారుతున్నా పాఠశాల యాజమాన్యం సరైన వైద్యం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సూచన మేరకు బాలుడిని విమ్స్‌కు తరలించి ఎమ్మెల్సీ చేయించారు. చికిత్స పొందుతుండగానే బాలుడు వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి తీవ్రత అర్థమైంది. వేలల్లో ఫీజులు కట్టి పిల్లలను బడికి పంపిస్తుంటే.. ఇలా కొట్టి చంపేస్తారా? అంటూ విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
టీచర్‌పై వేటు..యాజమాన్యం సేఫ్..
ఘటనపై ఫిర్యాదులు రావడంతో డీఈవో ఎన్.ప్రేమకుమార్ ఆదేశాల మేరకు ఎంఈవో రవీంద్రబాబు మంగళవారం పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. విద్యార్థిని కొట్టిన గణిత ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని యాజమాన్యాన్ని సున్నితంగా మందలించి వదిలేశారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. కేవలం టీచర్‌ను బలిచేసి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన యాజమాన్యాన్ని అధికారులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాలల హక్కుల సంఘాలు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రైవేట్ స్కూల్‌లో దారుణం


