ఆకట్టుకున్న సప్త స్వరాలాపన
మద్దిలపాలెం: కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సంగీత కళాభారతి జలజాక్షి హాజరయ్యారు. మొదటి రోజు కార్యక్రమంలో డాక్టర్ గౌరీ, రామ్మోహన్‌రావులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కంకటాల మల్లిక్ దంపతుల చేతుల మీదుగా వీరికి రూ.10 వేల నగదు పురస్కారం, నూతన వస్త్రాలను అందజేశారు. ముఖ్యఅతిథి జలజాక్షి చేతుల మీదుగా ‘సంగీత కళాభారతి’ బిరుదును, జ్ఞాపికను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ.. తాము ఇప్పటివరకు ఎన్నో పురస్కారాలు పొందినప్పటికీ, ఇంత ఘనంగా సన్మానం జరగడం ఇదే మొదటిసారి అని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ మాధురి దేవి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ప్రదర్శించిన సంగీత గాత్ర రూపకం అలరించింది. 4 వీణలు, 20 మంది గాత్ర కళాకారులు కలిసి సద్గురు శ్రీ త్యాగరాజ సప్త స్వరాలాపన చేసి సభికులకు శ్రావ్యానందాన్ని పంచారు. వీఎండీఏ కార్యవర్గ సభ్యులు ఎం.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ రాంబాబు, పైడా కృష్ణప్రసాద్, పంతుల రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రారంభమైన
త్యాగరాజ ఆరాధనోత్సవాలు


