తాళం వేసిన ఇళ్లే టార్గెట్
ఇద్దరు దొంగల అరెస్ట్
మల్కాపురం: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. గాజువాక క్రైం పోలీసులు తెలిపిన వివరాలివి. తామర హరిబాబు, బండారి భరత్ తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి నగదు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. దీనిపై ఈ నెల 2వ తేదీన వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జీవీఎంసీ 59వ వార్డు పరిధిలోని కొత్త నక్కవానిపాలెం, గాజువాక పరిధిలోని అజీమాబాద్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలు ఒకే తీరుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం గాజువాక మసీద్ సెంటర్ వద్ద సంచరిస్తున్నారన్న సమాచారంతో క్రైమ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనాలకు పాల్పడింది తామేనని వారు అంగీకరించారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును క్రైమ్ సీఐ హరికృష్ణ మీడియాకు చూపించారు. మంగళవారం నిందితులను రిమాండ్‌కు తరలించారు.


