సమగ్ర ప్రణాళికతో వీఈఆర్ అభివృద్ధి
మహారాణిపేట : సమగ్ర ప్రణాళికతో వీఈఆర్ (విశాఖ ఎకనామిక్ రీజియన్) అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వీఈఆర్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, భూ సేకరణ ప్రక్రియ, మాస్టర్ ప్లాన్ అమలుపై విస్తృతంగా చర్చించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్‌భరత్ ఆయా శాఖల పరిధిలో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, అర్బన్ డెవలప్‌మెంట్, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు వంటి రంగాల్లో విశాఖ రీజియన్ సమగ్ర అభివృద్ధి చెందాలని కలెక్టర్ పేర్కొన్నారు.
విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. వీఈఆర్ అభివృద్ధికి అవసరమైన భూ సేకరణను వివాదాలు లేకుండా చేపట్టాలని సూచించారు. వీఈఆర్ పరిధిలో రోడ్లు, రైల్వే మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. స్టీల్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, ఫార్మా సిటీ, టూరిజం వంటి రంగాల్లో వీఈఆర్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలను మిగిలిన ప్రాంతాలతో అనుసంధానం చేయడం, రహదారుల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రిసార్టులు, హోటళ్ల ఆక్యుపెన్సీ పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. బీచ్ ఫ్రంట్‌లు, వరల్డ్ క్లాస్ థీమ్ పార్క్, వాటర్ స్పోర్ట్స్ హబ్‌లతో విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయాలన్నారు. కై లాసగిరి మాస్టర్ ప్లాన్ కింద మెగా రీ డిజైన్ పనులకు త్వరలో శ్రీకారం చుట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలోగా మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేయాలన్నారు. ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, మెట్రో, ఏపీఐఐసీ, పరిశ్రమలు, టూరిజం, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు, తహసీశీల్దార్లు సమావేశంలో పాల్గొన్నారు.
కలెక్టర్ హరేందిర ప్రసాద్


