చదువులో రాణిస్తేనే మంచి భవిష్యత్తు
ఆరిలోవ : చదువులో రాణిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మ్‌న్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణాపురంలో గల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఇక్కడ గురుకుల ఆవరణ, తరగతి గదులను పరిశీలించారు. పిల్లలతో నేరుగా మాట్లాడి సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా, రుచికరంగా వండుతున్నారా, బోధన బాగా జరుగుతుందా? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను విద్యార్థులు పేర్లు రాయకుండా పేపర్‌పై రాసి ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆయన నేరుగా గురుకులంలో వంట గదికి వెళ్లి పరిశీలించారు. పిల్లలు పేపర్లుపై రాసిన సమస్యలను చదివి అక్కడ వంట సిబ్బందికి వినిపించారు. నీరు ఎక్కువగా కలిపిన పప్పు పెడుతున్నారని, వంకాయ కూర వండినప్పుడు రుచిగా ఉండదని, వంట చేసే ఉమ అక్క తమను తరుచూ తిడుతుందని విద్యార్థులు రాశారు. దీంతో విద్యార్థులను తిడుతున్న వంట మనిషి ఉమను మార్చేయాలని గురుకులాల జిల్లా సమన్వయాధికారి గ్రేస్‌ను ఆదేశించారు. విద్యార్థుల కోసం రుచిగా వంటలు చేసి మంచి భోజనం పెట్టాలని సూచించారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వేసిన పెయింటింగ్స్‌ను పరిశీలించారు. అక్కడ పదో తరగతి విద్యార్థి వేసిన ఓ పెయింటింగ్ పరిశీలించి అభినందించారు. ఈ సందర్శనలో డీఈవో ఎన్.ప్రేమకుమార్, గురుకులాల సమన్వయాధికారి గ్రేస్, గురుకులం ప్రిన్సిపాల్ పూతిరెడ్డి మురళి, అధ్యాపకులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి


