నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తా
మహారాణిపేట: జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం యంత్రాంగం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘రెవెన్యూ క్లినిక్’కు ఆర్జీదారులు పోటెత్తారు. సాధారణంగా జరిగే పీజీఆర్‌ఎస్ కంటే ఈ క్లినిక్‌కే జనాలు ఎక్కువగా తరలిరావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గత వారం 72 వినతులు రాగా, ఈ సోమవారం ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 137కు చేరింది. దీంతో బాధితుల నమోదు కోసం అధికారులు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఆన్‌లైన్ మ్యుటేషన్లు, 1బి పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో రెవెన్యూ అధికారులు కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తుండటంతో బాధితులు జిల్లా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమస్య పరిష్కారం కాకపోయినా ఫోన్లకు పరిష్కృతమైందనే సందేశాలు రావడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు వంటి అంశాల్లో నివేదికలు స్పష్టంగా ఉండాలని, బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఫైళ్లను వెనక్కి పంపడం లేదా అమరావతిలోని సీసీఎల్‌ఏ కార్యాలయానికి పంపడం సరికాదని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో దళారులు, రాజకీయ నాయకుల ప్రమేయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, సామాన్య ప్రజల పట్ల సహృదయంతో స్పందించి నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. డాక్యుమెంట్లు లేవనే నెపంతో డిజిటల్ అసిస్టెంట్లు అర్జీలను తిరస్కరించవద్దని, కనీసం సర్వే నంబర్ ఉన్నా దరఖాస్తును స్వీకరించి విచారణ చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సిబ్బందిపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం జేసీ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో కొనసాగిన రెవెన్యూ క్లినిక్‌లో విశాఖ, భీమిలి ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, అన్ని మండలాల తహసీల్లార్లు కలెక్టరేట్ వీసీ హాలులో ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరించారు. అక్కడికక్కడే ఫిర్యాదు తాలూక వివరాలపై విచారించారు. వాటి పరిస్థితిని తెలియజేస్తూ పరిష్కారం కోసం చేపట్టబోయే చర్యలను వివరించారు. జేసీ దగ్గరుండి రెవెన్యూ క్లినిక్‌ను పర్యవేక్షించారు.
ఆక్రమణదారుల నుంచి
రక్షణ కల్పించాలి
నేను 1993లో గంభీరం, బోయిపాలెం ప్రాంతాల్లో 164 గజాల చొప్పున నాలుగు స్థలాలను కొనుగోలు చేశాను. అన్ని చట్టబద్ధమైన పత్రాలు ఉన్నప్పటికీ, కొద్ది నెలలుగా స్థానికులు నన్ను స్థలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ ఆక్రమించుకున్నారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అధికారులు స్పందించి, సర్వే నంబర్ల ప్రకారం నా స్థలాన్ని అప్పగించి, రక్షణ కల్పించాలి.
– ఎన్.స్వర్ణలత, మధురవాడ
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తా
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తా


