నేటి నుంచి త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు
మద్దిలపాలెం: కళాభారతి వేదికగా త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఏడు రోజుల పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వేడుకలను పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ప్రారంభించనుండగా, డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావుకు ‘సంగీత కళాభారతి’ బిరుదును ప్రదానం చేయనున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే ఈ సంగీత యజ్ఞంలో దేశవిదేశాల నుంచి తరలివచ్చే వెయ్యికి పైగా కళాకారులు 429 కచేరీలను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా 7వ తేదీన త్యాగరాజ స్వామి వర్ధంతి సందర్భంగా నిర్వహించే పల్లకి సేవ, పంచరత్న కృతుల బృంద గానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు సాగే ఈ ఉత్సవాలు 12న ఆంజనేయ స్వామి ఉత్సవం, మంగళహారతితో ముగుస్తాయని ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ జి.ఆర్.కె. ప్రసాద్ తెలిపారు.


