ఏడు దేశాల నిపుణులకు క్యాన్సర్ చికిత్సలో శిక్షణ
అగనంపూడి : అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రిలో సోమవారం ‘బిమ్‌స్టెక్’ దేశాల సమష్టి కృషితో క్యాన్సర్ కేర్‌పై ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి 6వ బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రకటన మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ అంతర్జాతీయ స్థాయి శిక్షణను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డైరెక్టర్ ఉమేష్ మహంత్‌శెట్టి మాట్లాడుతూ.. భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన 35 మంది వైద్య నిపుణులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారని తెలిపారు. క్యాన్సర్ నివారణ, ఆధునిక చికిత్సా పద్ధతులపై అన్వేషణలతో పాటు ఏడు దేశాల మధ్య మెరుగైన వైద్య నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మెడ్‌టెక్ జోన్ సీఈవో జితేంద్రశర్మ, ఉక్కు డైరెక్టర్ ఏ.కె.బాగ్చి మాట్లాడుతూ.. నాణ్యమైన, సమగ్రమైన వైద్య సేవలను తక్కువ ఖర్చుతో బాధితులకు అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి పొరుగు రాష్ట్రాల రోగులకు కూడా ఇక్కడ విశేష సేవలు అందుతున్నాయని గుర్తుచేశారు. ఈ అంతర్జాతీయ శిక్షణలో భాగంగా ఆంకో పాథాలజీ, ఆంకో నర్సింగ్, ప్యాలియేటివ్ మెడిసిన్, ప్రివెంటివ్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ వంటి విభాగాల్లో నాలుగు వారాల పాటు ఇంటెన్సివ్ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.


