రికార్డుల్లో ‘పరిష్కారం’.. క్షేత్రస్థాయిలో ప్రహసనం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల తీరుపై అర్జీదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఫైల్స్ పెండింగ్‌లో ఉండకూడదనే ఉద్దేశంతో, క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా పరిష్కారమైనట్లు అధికారులు మొక్కుబడిగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్జీదారుల సంతకాలు లేకపోయినా, నేరుగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమస్య పరిష్కారమైందంటూ తప్పుడు సమాచారం పంపిస్తున్నారని పలువురు సోమవారం మీడియా దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి ప్రజల నుంచి మొత్తం 108 వినతులు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానికి 42 ఫిర్యాదులు అందగా, ఇంజినీరింగ్ సెక్షన్‌కు 28, అడ్మినిస్ట్రేషన్ విభాగానికి 17, రెవెన్యూ విభాగానికి 12, ప్రజారోగ్య విభాగానికి 7 ఫిర్యాదులు అందాయి. మొక్కల విభాగం, యూసీడీ విభాగాలకు ఒక్కో విన్నపం వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ, ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణ రాజు, ఇన్‌చార్జ్ ప్రధాన వైద్యాధికారి అప్పలనాయుడు, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్ డీడీహెచ్ వాసు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.


