పార్కింగ్ ఫీజులు నియంత్రించండి
జీవీఎంసీ కమిషనర్‌కు
కొండా రాజీవ్ వినతి
గతంలో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేస్తే..
సమస్య పరిష్కారం కాకుండానే
పరిష్కారమైనట్టు నమోదు
డాబాగార్డెన్స్: నగరంలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 44ను కఠినంగా అమలు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది కొండా రాజీవ్‌గాంధీ కోరారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన కమిషనర్ కేతాన్‌గార్గ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కింగ్ ఫీజుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను బహిరంగంగా ఉల్లంఘిస్తూ ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జీవో 44 ప్రకారం.. మొదటి 30 నిమిషాలు పార్కింగ్ పూర్తిగా ఉచితమని, షాపింగ్ బిల్లు లేదా సినిమా టికెట్ చూపిస్తే మొదటి గంట వరకు ఉచితంగా ఉండాలని గుర్తు చేశారు. గంట దాటిన తర్వాత కూడా బిల్లు మొత్తం పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఉచిత పార్కింగ్ కల్పించాలనే నిబంధనలు ఉన్నాయని, కానీ చాలా చోట్ల వీటిని పాటించడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదు చేసినా, సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్లు నమోదు చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలకు నోటీసులు జారీ చేయాలని, పార్కింగ్ ప్రాంతాల్లో నిబంధనలకు సంబంధించిన సైన్ బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల హక్కులను పరిరక్షించాలని రాజీవ్‌గాంధీ విజ్ఞప్తి చేశారు.


