కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు
ఎంవీపీకాలనీ: నగర శివార్లలోని కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృత దాడులు చేపట్టారు. రెండు రోజులుగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిర్వహిస్తున్న ఈ తనిఖీల్లో భాగంగా.. సోమవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎంవీపీ కాలనీలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని తుంగ్లాంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేయగా 12 మంది పట్టుబడ్డారు. వారి నుంచి కోడిపుంజులతో పాటు రూ. 15,200 స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండాల కాలనీలో నిర్వహించిన దాడుల్లో 14 మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మూడు కోడిపుంజులు, రూ. 10,500 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు.


