9 నుంచి మహా సంక్రాంతి సంబరాలు
మద్దిలపాలెం: ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో మహా సంక్రాంతి సంబరాలు–2026కు సంబంధించిన రాట మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పూజలు చేసి, వేడుకల వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 13, 14, 15 తేదీల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయని, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారని వివరించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘ఇంటింటా స్వదేశీ – ప్రతి ఇంటా స్వదేశీ’అనే నినాదంతో పాటు వందేమాతర గీతం 150 ఏళ్ల ఉత్సవాలు, దేశ సమైక్యతలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి విశిష్టతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు జీవీఎల్ వెల్లడించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఎం.ఎన్. పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు.


