ఉద్యమించిన ఉక్కు నిర్వాసిత నిరుద్యోగులు
పెదగంట్యాడ: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం సర్వం కోల్పోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉక్కు నిర్వాసిత నిరుద్యోగులు ఆదివారం ఉద్యమించారు. పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు నిరసనగా భిక్షాటన చేయడానికి పూనుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, యాజమాన్యానికి తమ ఆవేదనను తెలియజేయాలని భావించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. భిక్షాటన ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో, వారంతా కుటుంబ సభ్యులతో సహా పాత గాజువాకలోని లంకా మైదానంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాసిత సంఘం నాయకులు మాట్లాడుతూ.. నిర్వాసిత నిరుద్యోగులకు స్టీల్‌ప్లాంట్ మిగులు భూముల్లో ఎకరం చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలని, లేని పక్షంలో జీవనభృతి కింద నెలకు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని కోరారు. వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్న తమను స్టీల్‌ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికి భూములు తీసుకున్నారని, నాటి నుంచి నేటి వరకూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో 64 గ్రామాలకు చెందిన నిర్వాసితులు, నాయకులు పితాని భాస్కరరావు, ఉమ్మిడి అప్పారావు, పల్లా కార్తీక్, గళ్లా రామకృష్ణ, కోన రమణ, పేర్ల జగన్, నడిగట్ల ప్రసాద్, మంత్రి గోపీ, అంగాల దేముడు తదితరులు పాల్గొన్నారు.


