నృత్య సాగర సోయగం
మద్దిలపాలెం: భారతీయ సంప్రదాయ నృత్యాలన్నీ ఒకే వేదికపై ఏకమై..‘థక్ ధిమి తయ్యాకు తాక ధిమి’ తాళాల మధ్య వందలాది మంది కళాకారులు నర్తిస్తూ నృత్య సాగర సోయగాన్ని ఆవిష్కరించారు. సాక్షాత్తు వైశాఖేశ్వరునికి నృత్య నీరాజనం పలికిన ఈ మహా బృంద నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నటరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఎంజీఎం పార్క్ వేదికగా జరిగిన ‘ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ – 2026’ ముగింపు వేడుకలు కనులపండువగా సాగా యి. సుమారు 750 మంది కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్య రీతుల్లో ఏకకాలంలో నర్తిస్తూ నటరాజుకు, పార్వతీదేవికి అర్పించిన నృత్య నివేదన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకను వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, దాడి ఇన్‌స్టిట్యూట్స్ అధినేత దాడి రత్నాకర్, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ బి. సత్యనారాయణ రాజు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ కళలకు అంతర్జాతీయ వేదికగా విశాఖ నిలవడం గర్వకారణమన్నారు. పదర్శనల్లో భాగంగా నటరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు సమర్పించిన మహిషాసుర మర్దిని నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. పద్మభూషణ్ వెంపటి చిన సత్యం నృత్య పరికల్పనలోని కూచిపూడి ‘నాట్యాంబ్రహ్మాంజలి’, కేవీ సత్యనారాయణ రూపొందించిన ‘వినాయక స్తుతి’ ప్రేక్షకులను అలరించాయి. భరతనాట్య విభాగంలో మైసూర్‌కు చెందిన డా. వసుంధర దొరస్వామి దర్శకత్వంలోని ప్రదర్శనలు, ఆంధ్రనాట్య సృష్టికర్త కళాకృష్ణ పరికల్పనలోని అంశాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భంగా కళాక్షేత్రంలో విశేష సేవలందించిన డా. వసుంధర దొరస్వామిని ఐటీడీసీ జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమ రథసారథి విక్రమ్ గౌడ్ పర్యవేక్షణలో ఈ నాట్య విలాసం దిగ్విజయంగా ముగిసింది. హరేకృష్ణ మూమెంట్‌కు చెందిన నిష్కించిన భక్తదాస, కార్పొరేటర్ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.
750 మంది కూచిపూడి, భరతనాట్య విన్యాసం


