ఉత్సాహంగా రెడ్డి కుటుంబాల ఆత్మీయ కలయిక
ఎంవీపీకాలనీ: శివాజీపార్కులో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రెడ్డి కుటుంబాల ఆత్మీయ కలయిక ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకకు వైఎస్ రవీంద్రనాథ్‌రెడ్డి, మారిటైం బోర్డ్ మాజీ చైర్మన్ కాయల వెంకటరెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సమష్టి కృషితోనే రెడ్ల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఏటా ఇలాంటి వేడుకలు నిర్వహించి కుటుంబాల మధ్య బంధాన్ని పెంచాలని, మహిళలు, చిన్నారుల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. సంఘం అధ్యక్షుడు గొరుసు మహేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్తి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విశాఖలో రెడ్లకు కనీసం ఒక్క ఎమ్మెల్యే టికెట్ అయినా కేటాయించాలని కోరారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చిన ప్రతిసారీ రెడ్డి కులస్తులను గెలిపించుకున్న చరిత్ర ఉందన్నారు. జీవీఎంసీ తొలి మేయర్, ఎమ్మెల్యే ఎన్‌ఎస్‌ఆర్ రెడ్డి, సూర్యరెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, సుబ్బరామిరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి వంటి ఎందరో రెడ్లు విశాఖలో ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారని గుర్తుచేశారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా టికెట్లు కేటాయిస్తే వారిని గెలిపించుకునే బాధ్యత ఇక్కడి రెడ్డి సంఘాలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గంట గంటకు పట్టు చీర, ప్రశ్నలకు దంపతులిద్దరూ ఒకే సమాధానం చెప్పడం, కుర్చీల కింద టోకెన్స్ గేమ్‌లో సిల్వర్ కాయిన్స్ గెలుచుకోవడం వంటి పోటీలు ఉత్సాహాన్ని నింపాయి.


