భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత జగన్‌దే
డాబాగార్డెన్స్: ఇతరులు చేసిన అభివృద్ధి పనులను తన ఖాతాలో వేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధహస్తుడని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ విమర్శించారు. గతంలో సెల్‌ఫోన్ కనిపెట్టింది తానేనని, గూగుల్‌ను విశాఖకు తెచ్చింది తానేనని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలోనూ అదే క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో సింహభాగం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగిందని జాన్‌వెస్లీ గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూసేకరణను పూర్తి చేసిందని, రైతులకు ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం అందించిందన్నారు. డి–పట్టా భూములకు సైతం జిరాయితీ భూములతో సమానంగా పరిహారం చెల్లించి రైతులకు న్యాయం చేశారని తెలిపారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వదిలేసిన 117 ఎకరాల భూ సేకరణను కూడా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. నిర్వాసితులైన 376 కుటుంబాలకు రూ.80 కోట్లతో టౌన్‌షిప్ స్థాయి సౌకర్యాలతో కాలనీని ఏర్పాటు చేశారని, ఒక్కో కుటుంబానికి 5 సెంట్ల స్థలంతో పాటు రూ.8.70 లక్షల పరిహారం అందించారని చెప్పారు. అన్ని అనుమతులతో 2023 మే 3న భూమిపూజ నిర్వహించి, 3.8 కి.మీ రన్‌వే, రక్షణ గోడ నిర్మాణం, 6 లైన్ల అప్రోచ్ రోడ్డు పనులను వేగవంతం చేశారని వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కేవలం ఓట్ల కోసం అనుమతులు లేకుండానే కొబ్బరికాయ కొట్టి ప్రాజెక్టును గాలికి వదిలేశారని జాన్‌వెస్లీ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుత ట్రయల్ రన్ ఆ కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. ఇప్పటికై నా చంద్రబాబు ఇతరుల కష్టాన్ని తనదిగా చెప్పుకునే నైజాన్ని మానుకోవాలని హితవు పలికారు.


