69 పోక్సో కేసుల్లో శిక్షలు
అల్లిపురం: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 2024, జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో 69 పోక్సో కేసులలో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని నగర శాంతిభద్రతల డీసీపీ–2 డి.మేరీ ప్రశాంతి వెల్లడించారు. శనివారం సాయంత్రం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వివరాలను సుదీర్ఘంగా వివరించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత భాగ్చి మార్గదర్శకత్వంలో అనేక కేసులను అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించి, వేగవంతమైన దర్యాప్తు నిర్వహించి సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయడం వల్లే ఈ స్థాయిలో శిక్షలు పడడం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు తీర్పు వెలువడిన కేసులలో ఒకరికి మరణ శిక్ష, ఇద్దరికి మరణించే వరకూ జీవిత ఖైదు, పది మందికి జీవిత ఖైదు పడగా, మరో 15 కేసుల్లో ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రెండింటిలో ఇరవై ఐదు ఏళ్లు, మరో రెండు కేసుల్లో పది ఏళ్లు, మూడు కేసుల్లో ఏడేళ్ల పాటు కఠిన కారాగార శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పునిచ్చాయని వివరించారు.
వీటిలో ప్రధానంగా ఐదు కేసులలో అత్యంత తక్కువ కాలంలోనే న్యాయ ప్రక్రియ ముగిసిందని డీసీపీ తెలిపారు. 2024 సెప్టంబర్ 24న నమోదైన ఒక కేసులో, కన్న తండ్రే తన ఇద్దరు మైనర్ బాలికలపై లైంగికదాడికి పాల్పడగా, కేవలం 10 నెలల వ్యవధిలో అంటే 2025 ఆగస్టు 21న విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేలు జరిమానా విధించడంతో పాటు బాధితురాళ్లకు చెరో మూడు లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయాలని ఆదేశించింది. అదేవిధంగా 2025 జనవరి 21న నమోదైన మరో కేసులో 8 నెలల వ్యవధిలోనే సెప్టంబర్ 12న శిక్ష పడగా, శారీరక, మానసిక దివ్యాంగురాలైన మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి రూ.4 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. ఏప్రిల్ 16న నమోదైన మరో దారుణ ఘటనలో, కన్న తండ్రే తన నాలుగేళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడగా, ఐదు నెలల కాలంలోనే సెప్టంబర్ 29న కోర్టు సంచలన తీర్పునిస్తూ నిందితుడికి మరణం వరకూ కఠిన కారాగార జీవిత ఖైదుతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించి, ప్రభుత్వం బాధితురాలికి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పేర్కొంది. మార్చి 26న జరిగిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో 9 నెలల వ్యవధిలో డిసెంబర్ 30న తీర్పు రాగా, నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.20 వేలు జరిమానా విధించి, ఆ మొత్తాన్ని బాధితురాలికి అందజేయాలని కోర్టు తెలిపింది. జూన్ 7న నమోదైన మరొక కేసులో కేవలం ఆరు నెలల వ్యవధిలో అంటే ఈ ఏడాది జనవరి 2న తీర్పు వెలువడగా, మైనర్ బాలికపై లైంగిక దాడికి సహకరించిన ఒక మహిళతో సహా ఇద్దరు నిందితులకు చెరో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి రూ.40 వేలు నష్టపరిహారం చెల్లించాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు ఆదేశించింది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. నగర పౌరులు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకోకుండా సన్మార్గంలో నడుస్తూ నగరానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పోలీసులు ఆకాంక్షించారు.


