స్టూడెంట్ వార్
రెండు కాలేజీల మధ్య ‘ప్రాంక్’ యుద్ధం!
మధురవాడ: కేవలం ఒక ‘ప్రాంక్ కాల్’ రెండు కళాశాలల విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వివాదం కాస్తా ముదిరి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ కొట్లాటలో ఓ విద్యార్థి కంటికి తీవ్ర గాయమవగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..?
మిథిలాపురి వుడా కాలనీలోని ఆకాశ్ కళాశాల, పీఎంపాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల మధ్య శనివారం సాయంత్రం ఓ ప్రాంక్ కాల్ విషయంలో గొడవ మొదలైంది. ఇది కాస్తా ముదిరి ఇరు కళాశాలల విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. మధురవాడ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలోని ఒక నిర్జన ప్రదేశాన్ని వేదికగా చేసుకుని పరస్పరం దాడులకు దిగారు. విద్యార్థులు మృగాల్లా కొట్టుకుంటున్న తీరు చూసి స్థానికులు సైతం వారిని విడిపించే సాహసం చేయలేకపోయారు. ఆ ప్రాంతమంతా కాసేపు రణరంగంలా మారింది.
తీవ్ర గాయంతో ఆస్పత్రిలో విద్యార్థి
ఈ ఘర్షణలో చంద్రంపాలెం ప్రాంతానికి చెందిన ఆకాశ్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కంటికి తీవ్ర గాయమైంది. దీంతో తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు వెంటనే అతనిని మధురవాడలోని కంటి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని మరో ప్రముఖ కంటి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
క్రమశిక్షణపై మేధావుల ఆందోళన
కళాశాల యాజమాన్యాలు కేవలం లక్షలాది రూపాయల ఫీజుల వసూలుపైనే దృష్టి పెడుతున్నాయని, విద్యార్థుల క్రమశిక్షణను గాలికి వదిలేస్తున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. పేరున్న సంస్థల్లోనే ఇలాంటి దాడులు, ఆత్మహత్యలు, విద్యార్థులు పారిపోవడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు, యంత్రాంగం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


