పేదలకు మొండిచేయి.. పెద్దలకు రెడ్ కార్పెట్
మధురవాడ: ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ భూముల్లోని నివాసాల క్రమబద్ధీకరణ ప్రక్రియ విశాఖ రూరల్ మండలంలో వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా పీఎంపాలెం ఆర్‌హెచ్ కాలనీలో జరుగుతున్న సర్వే ప్రక్రియ పక్కదోవ పడుతోందని, ఇది కేవలం ధనికులకు, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే కొమ్ముకాస్తోందని స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ప్రతిపాదించిన స్థలం కావడంతో క్రమబద్ధీకరణ సాధ్యం కాదని అధికారులు గతంలో చెప్పడంతో సామాన్య పేదలెవరూ దరఖాస్తులు చేసుకోలేదు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా పాలక పక్షం అండదండలు ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగిన వారి నివాసాల కోసం రహస్యంగా సిఫార్సులు అందడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గ్రేడ్–2 వీఆర్వో వి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 20 మంది ఆర్థిక స్థోమత ఉన్న వారి నివాసాలకు మాత్రమే సర్వే నిర్వహించారు. దీనిని గమనించిన స్థానిక పేద ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. తమకు అవకాశం లేదని చెప్పి, ఇప్పుడు కొందరికే ఎలా సర్వే చేస్తారని రెవెన్యూ సిబ్బందిని నిలదీయగా, వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. సచివాలయ సిబ్బంది పక్షపాత ధోరణి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, సామాన్యులకు సమాచారం అందించకుండా కేవలం తమకు కావలసిన వారి చేతనే దరఖాస్తులు చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
సచివాలయం తీరుపై అనుమానాలు..
ప్రస్తుతం సచివాలయంలో డీపీవో లేకపోవడం, ఇన్‌చార్జ్ డీపీవో సెలవులో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని వీఆర్వో, ఇతర సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి, పీఎంపాలెం ఆర్‌హెచ్ కాలనీలో జరుగుతున్న అక్రమ సర్వేపై విచారణ జరిపి, అర్హులైన పేదలందరికీ సమన్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


