కార్పొరేట్ పాలసీతో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం
ఏయూక్యాంపస్: కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ల అనుకూల విధానాలతో కార్మికులు, రైతులు ఇతర వర్గాలపై ఆర్థికదాడి పెరుగుతూ... విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటాలు ఉధృతం చేసేందుకు సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలో చర్చించినట్లు సీఐటీయూ అఖిల భారత కార్యవర్గ సభ్యుడు సిహెచ్.నర్సింగరావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఏయూ కన్వెన్షన్ హాల్ మహాసభల ప్రాంగణంలో సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్‌తో కలిసి నర్సింగరావు విలేకరులతో మాట్లాడుతూ కార్మికుల సమస్యలు, ప్రత్యామ్నాయ విధానంపై చర్చించారని తెలిపారు. దేశంలో ప్రైవేట్ పేరుతో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను సామాన్యులకు లేకుండా చేసే విధానంపై సీఐటీయూ పోరాడుతుందని, ఇదే అజెండాతో రాబోయే కాలంలో ప్రతి రంగానికి సంబంధించిన ‘చార్టర్ ఆఫ్ డిమాండ్స్’ తయారు చేస్తున్నామన్నారు. కేరళలో పేపర్ మిల్లును ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కార్మికవర్గంపై భారం పడకుండా కేరళ ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలిపారు.
రేపు భారీ ర్యాలీ, బహిరంగ సభ
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద గల అంబేడ్కర్ విగ్రహం నుంచి డాబాగార్డెన్స్, జగదాంబ మీదుగా ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వరకూ భారీ కార్మిక ప్రదర్శన ఉంటుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్ తెలిపారు. ర్యాలీ అనంతరం మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు.
సీఐటీయూ అఖిల భారత కార్యవర్గ సభ్యుడు సీహెచ్ నర్సింగరావు


