రైలు కింద పడి మాజీ సైనికుడు ఆత్మహత్య
అగనంపూడి: ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. దేశ సరిహద్దులో సేవలందించి, ఉక్కు కర్మాగారంలోనూ పనిచేసి విశ్రాంతి పొందుతున్న ఒక మాజీ సైనికుడు అప్పుల బాధ తాళలేక కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శనివారం మధ్యాహ్నం దువ్వాడ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డు సూర్య ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న నీలాపు వెంకటరమణ (66) అలియాస్ సైనికుడు, గతంలో ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగిగా చేరి అక్కడ కూడా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన బీసీ రోడ్డులో ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌ను నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం యథావిధిగా స్టోర్‌ను తెరిచిన ఆయన, మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దువ్వాడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫామ్‌పైకి హౌరా నుంచి బెంగళూరు వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వస్తున్న సమయంలో వెంకటరమణ ఒక్కసారిగా పట్టాలపై పడుకున్నాడు. రైలు ఆయన మీదుగా వెళ్లడంతో తల, మొండెం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే దువ్వాడ జీఆర్‌పీ ఎస్‌ఐ లక్ష్మి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అప్పుల బాధ తట్టుకోలేకనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


