వాల్తేరు చుట్టూరాజకీయం!
● జోన్ అభివృద్ధికే గండం
● శ్రీకాకుళం జిల్లా మొత్తం కొత్త జోన్‌లో ఉంచాలంటూ ప్రతిపాదనలు
● ఇచ్ఛాపురం సెక్షన్‌ని ఇవ్వబోమంటున్న ఈస్ట్‌కోస్ట్ జోన్
● తేలే వరకూ గెజిట్ ఇవ్వొద్దంటూ రైల్వే బోర్డుకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి
● ఆదాయం వచ్చే కేకే లైన్ వైజాగ్‌కు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ తనూజ వినతి
గెజిట్‌కు మోకాలడ్డుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డివిజన్‌లో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కుంపటి రగుల్చుతోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న డివిజన్‌ని కొనసాగించాలంటూ వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంటే.. టీడీపీ ఎంపీలు మాత్రం కాలగర్భంలో కలిపేసేందుకు కుట్రపన్నుతున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు పక్క రాష్ట్రానికి అప్పగించి.. ప్రసాదం చేతులో పెడుతుంటే ఆహా ఓహో అంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలు.. తమకు రైల్వేకు అందే ఆదాయ మార్గం వద్దు.. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ గెజిట్ రాకుండా అడ్డుపడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇచ్ఛాపురం వరకూ విశాఖ డివిజన్‌లో ఉంచాలంటూ ఎంపీ రామ్మోహన్‌రావు పట్టుబడుతుంటే.. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ అధికారులు దాన్ని వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. మరోవైపు డివిజన్‌కు, జోన్‌కు ఆదాయం తీసుకొచ్చే కేకే లైన్‌ని రాయగడలో కాకుండా విశాఖలో కొనసాగించాలంటూ అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి పట్టుబడుతున్నారు.
రామ్మోహన్ రాజకీయ మనుగడ కోసం..
దక్షిణ కోస్తా జోన్‌లో కీలక ఆదాయ మార్గమైన కేకే లైన్ వాల్తేరు డివిజన్‌లో ఉండాలని ఉత్తరాంధ్రవాసులు కోరుతున్నారు. దీంతో పాటు పలాస– ఇచ్ఛాపురం సెక్షన్ కూడా ఇక్కడే ఉండాలని అడుగుతున్నారు. కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఈ విషయంలో కేవలం శ్రీకాకుళం ఎంపీగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తన భవిష్యత్తు రాజకీయ మనుగడ కోసం కేవలం పలాస– ఇచ్ఛాపురం సెక్షన్‌ని మాత్రమే పట్టుకొని వేలాడుతున్నారు. ఇచ్ఛాపురం వరకు దక్షిణ కోస్తా జోన్‌లో ఉంచాలంటూ పదే పదే కోరుతున్నారు. అది తేలే వరకూ గెజిట్ ఇవ్వొద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ మాత్రం అంగీకరించడం లేదు. ఇచ్ఛాపురం సెక్షన్ వరకూ ఇవ్వాలంటే రాయగడ–నౌపడ లూప్ సెక్షన్ తమకు ఇవ్వాలంటూ షరతు విధించింది. పలు దఫాల చర్చలు విఫలమవుతూనే ఉన్నా.. రామ్మోహన్ మాత్రం తన రాజకీయ భవిష్యత్తు కోసమే తప్ప.. జోన్ అభివృద్ధి కోసం కాంక్షించకపోవడం గర్హనీయమంటూ పలువురు దుయ్యపడుతున్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా ఉన్న జోన్ ఏర్పడుతున్నప్పుడు.. ఈ ప్రాంతం అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పోరాడాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలే తప్ప.. రాజకీయ స్వలాభం కోసం ఆలోచించకూడదు. ఇచ్ఛాపురం సెక్షన్ కూడా విశాఖ డివిజన్‌లో ఉండాల్సిందే. అదేవిధంగా ఆదాయం తీసుకొచ్చే కేకేలైన్ మొత్తం ఇక్కడే ఉంటే.. భవిష్యత్తులో జోన్ మరింత ముందుకు వెళ్తుందన్న విషయం టీడీపీ ఎంపీలు గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 2న రావాల్సిన గెజిట్.. పరిశీలనల్లో లేని విజ్ఞప్తుల వల్ల ఆగిపోయింది. ఇది బాధాకరం. కేకే లైన్ కోసం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కలిసి పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. త్వరగా జోన్‌కు సంబంధించిన గెజిట్ విడుదల చెయ్యాలని కోరుతున్నాం.
– గుమ్మ తనూజరాణి, అరకు ఎంపీ
అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాల్తేరు డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు వరంలాంటిది. ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ.17 వేల కోట్లు కాగా, ఇందులో రూ.10 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. దేశంలోనే సుమారు 300 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఏటా సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయమంతా.. ఇప్పుడు రాయగడ డివిజన్‌కు సొంతమవుతుంది. జోన్ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా కేకే లైన్ వాల్తేరు పరిధిలో అంటే త్వరలో ఏర్పడే విశాఖ డివిజన్‌లో ఉండాల్సిందేనని వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు, డివిజన్ అధికారులు చెబుతున్నారు. కేకే లైన్ లేకపోతే.. విశాఖ డివిజన్ ఆదాయం రూ.3 వేల కోట్లు కూడా దాటే అవకాశం లేదు. దీంతో కొత్త జోన్ అభివృద్ధి సక్రమంగా జరిగే సూచనలు లేవని ఆందోళన చెందుతున్నారు. దీనిని కూడా రాజకీయం కోసం చంద్రబాబు ప్రభుత్వం వాడుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


