రికార్డులు కొట్టినా.. జీతాల్లో కోతలే..
స్టీల్‌ప్లాంట్‌లో రికార్డు ఉత్పత్తి సాధించినా దక్కని పూర్తి వేతనం
ఉక్కునగరం : ఉత్పత్తి ఆధారిత వేతనాలు ఎంత కాలం అంటూ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌లో అత్యధిక ఉత్పత్తితో అనేక రికార్డులు నమోదు చేసినా పూర్తి జీతం ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2024 సెప్టెంబర్ నుంచి యాజమాన్యం ఉద్యోగుల జీతాలపై కోతలు మొదలు పెట్టింది. తద్వారా గత ఏడాది సెప్టెంబర్ నాటికి 355 శాతం జీతం పెండింగ్‌లో పెట్టింది. గత ఏడాదిలో అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే నూరు శాతం చెల్లించింది. ఇక నుంచి నూరు శాతం జీతం వస్తుందని ఉద్యోగులు ఊపిరి పీల్చుకునే క్రమంలో యాజమాన్యం మరో రకంగా దాడికి పాల్పడింది. ఇకపై ఆయా విభాగాల ఉత్పత్తి ఆధారంగా మాత్రమే జీతాలు చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. కార్మిక సంఘాలు తమ నిరసన తెలిపినప్పటికి యాజమాన్యం వెనుకంజ వేయలేదు. దీంతో కార్మిక సంఘాలు యాజమాన్యం తీరుపై రీజనల్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ ఉత్తర్వులు ఉపసంహరించాలని, వెంటనే ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని ఆదేశించారు. అయినప్పటికి యాజమాన్యం నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయం కనిపించకపోవడం పట్ల కార్మిక వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు నెలలు ఉత్పత్తి ఆధారంగా పర్సంటేజి జీతాలు చెల్లించడం వల్ల ఉద్యోగుల పెండింగ్ జీతాలు 380 శాతానికి చేరుకున్నాయి.
డీపీఈ చెప్పినా పట్టదా..
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన వేతనాలు, అలవెన్సులు, సదుపాయాలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డీపీఈ) ఆదేశాల మేరకు జరుగుతుంటాయి. గతంలో డీపీఈ ఆదేశాల మేరకే స్టీల్‌ప్లాంట్ క్వార్టర్ల విద్యుత్ చార్జీలను యాజమాన్యం పెంచింది. ఉత్పత్తి ఆధారిత జీతాలపై ఉక్కు యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలపై ఉక్కు అధికారుల సంఘం (సీ) డీపీఈకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన డీపీఈ ఆ ఉత్తర్వు లపై తమకు వివరణ ఇవ్వాలని కోరినప్పటికి ఉ క్కు యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు
సంస్థలో పనిచేసే ఉద్యోగుల జీతాలు లాభనష్టాలు, ఉత్పత్తితో సంబంధం ఉండదని కార్మిక చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఉత్పత్తి ఆధారంగా ఇచ్చేది ఇన్సెంటివ్, రివార్డులు మాత్రమే అనేది సర్వజనీనం. అయితే కార్మిక చట్టాలు, కార్మిక సంక్షేమంపై ఎటువంటి నమ్మకం లేని స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్ణయాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ వ్యతిరేకించినప్పటికి డిసెంబర్ నెల జీతాన్ని కూడా ఉత్పత్తి ఆధారంగా చెల్లించడం గమనార్హం.
డిసెంబర్‌లో ఉత్పత్తి రికార్డులు
డిసెంబర్ నెలలో బ్లాస్ట్‌ఫర్నేస్, స్టీల్ మెల్ట్ షాప్‌లు ఉత్పత్తిలో పలు రికార్డులు సాధించాయి. బ్లాస్ట్‌ఫర్నేస్‌లు మూడు అత్యధికంగా హాట్ మెటల్ ఉత్పత్తి చేయగా, స్టీల్ మెల్ట్ షాప్‌లు అత్యధికంగా 136 హీట్లు ఉత్పత్తి చేసి గత రికార్డులను అధిగమించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ నెలలో ఆ రెండు విభాగాల్లో అత్యధిక ఉత్పత్తి జరిగినప్పటికి యాజమాన్యం కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.
ఉత్పత్తి ఆధారిత వేతనాలతో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం
380 శాతానికి చేరిన పెండింగ్ జీతాలు
డీపీఈ, లేబర్ కమిషనర్ ఆదేశాలు తుంగలోకి...


