టెండర్లకు ముసుగు.. కొటేషన్లతో దోపిడీ
కేజీహెచ్ కంప్యూటర్ల కొనుగోలులో చేతివాటం
నిర్దేశించిన ధర కన్నా అధికంగా కొనుగోలు
ఈ–ఫైల్ సాఫ్ట్‌వేర్ సపోర్టు చేయని వైనం
మహారాణిపేట: కేజీహెచ్‌లో కంప్యూటర్ల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ నెల 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ–ఫైల్’ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించిన నేపథ్యంలో కేజీహెచ్ యంత్రాంగం హడావుడిగా చేపట్టిన కంప్యూటర్ల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు సహాయ స్థాయి ఉద్యోగులు చక్రం తిప్పి, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలవకుండానే కేవలం కొటేషన్ల ఆధారంగా ఈ కొనుగోళ్లు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో వాస్తవ ధర కంటే రెట్టింపు ధర చెల్లించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే కాకుండా, స్వయంగా కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించారన్న విమర్శలు వినపడుతున్నాయి.
బయటపడిన బండారం
ఈ–ఆఫీస్ నిర్వహణ కోసం పరిపాలనా విభాగానికి అవసరమైన సుమారు 53 కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రిని మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలకు అంటే ఒక్కొక్క సెట్‌ను రూ. 60 వేల నుంచి రూ. 90 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఆస్పత్రి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ సొమ్ము వెచ్చించినా, తీరా ఆ కంప్యూటర్లను అమర్చాక ‘ఈ–ఫైల్’ సాఫ్ట్‌వేర్ వాటిలో సక్రమంగా పనిచేయకపోవడంతో అధికారుల బండారం బయటపడింది. నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇప్పుడు ఈ–ఆఫీస్ అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వైఫల్యంపై ప్రస్తుతం కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీ వర్గాల్లో వేడివేడిగా చర్చ సాగుతోంది.
చక్రం తిప్పిన ఇద్దరు ఉద్యోగులు
ధరల పెంపు, నాసిరకం కంప్యూటర్ల సరఫరా, ఫైళ్లపై సంతకాలు చేయించడం వంటి వ్యవహారాల వెనుక ఉన్న ఆ ఇద్దరు ఉద్యోగుల పాత్రపై సహచర సిబ్బంది మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు ప్రశ్నించినప్పుడు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ తప్పు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం కావడమే కాకుండా, అత్యవసరమైన ఈ–ఆఫీస్ సేవలకు ఆటంకం కలిగించిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.


